Adavi Nundi Adaviki | అడవి నుండి అడవికి
- Author:
 - Pages: 206
 - Year: 2018
 - Book Code: Paperback
 - Availability: In Stock
 - Publisher: Matti Mudhranalu-మట్టి ముద్రణలు
 
- 
              
₹120.00
 
అడవులు, అడవుల్లో మనుషులు, పల్లెలు, పంటలు, కాలువలు, నదులు, చెరువులు, కొండలు, గుళ్ళూ చూస్తూ వస్తున్నామన్నాను.
గుండెలపైన చేతులేసుకుంది. ఆమె కళ్ళు మెరిశాయి.
ఇన్ని చూసొచ్చిన మిమ్మల్ని చూస్తుంటే దేవుళ్ళను చూసినట్టుందన్నది. నా అదృష్టం మీరు నా ఇంటికొచ్చారు అంటున్నప్పుడు ఆమె కళ్ళు వెలుగుల్ని నింపుకున్నాయి.
బెంచీమీది నుంచి లేచి సైకిళ్ళు వైపు నడవబోతున్న మమ్మల్ని ఆమె మళ్ళీ ఆపింది.
మీ ఇద్దరినీ ఒక్కసారి తాకాలని ఉందన్నది.
నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది.
***
ఇద్దరు యాత్రా ప్రేమికులు సహచరులైన అపూర్వ జీవనశైలి నేపథ్యంగా జయతి లోహితాక్షన్ తెలుగు సాహిత్యానికి అందించిన అపురూపమైన కానుక ఈ యాత్రానుభవాల సంపుటి.
***
కోహిర్ ని  దాటాము. పొద్దు వాలిపోతూ ఉంది. ఏదోక చోట ఆగాలి. రోజులో మాకేదన్నా కొద్దిగా టెన్షన్ ఉందంటే ఇదొక్కటే. లోహి నా భద్రత గురించీ నేను తనగురించీ ఆలోచిస్తున్నాము. చేనైనా చెట్టు కిందనైనా నాకు చాలు. కోహిర్ చివర్లో మామిడి చెట్ల నీడ పశువుల కొట్టమూ కనపడింది. 
ఈ రోజుకి ఉందామా? 
బాగుంది. కానీ రాత్రి ఎవరైనా ఉంటారో లేదో. 
ఎవరూ లేకపోతే ఏమిటి? 
తాగే వాళ్ళు వచ్చేటట్టుంది. చూడు ఆ సీసాలు. 
దూరంగా జొన్న చేలో ఎవరో ఎదో పని చేస్తున్నారు.  అతన్నడిగి వస్తానని లోహికి చెప్పి జొన్న చేనువైపు నడిచాను. ఆలుగడ్డలు గంపలోకి ఏరి కుప్పపోస్తున్నాడు అతను. గంపెనెత్తుకొని వస్తున్న అతన్ని  ‘రాత్రి కొట్టంలో ఎవరన్నా ఉంటారా’ అని అడిగాను. ఎందుకన్నాడు. మా ప్రయాణం గురించి చెప్పి ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతామన్నాను. 
ఉండొచ్చు గాని చేలో ఎవరూ ఉండరు. అయినా భయం లేదులే. మీ ఇష్టం అన్నాడు. 
వెనక్కి తిరిగి వచ్చి లోహితో చెప్పాను. 
‘ఎవరన్నా ఉంటే తోడుగా ఉంటుంది, మనిద్దరమే అంటే ఎట్లా’ తన భయం నా గురించి. 
ముందుకు పోయి మరెక్కడన్నా చూద్దామన్నారు. ఆ చేలో నుండి నాకు  ముందుకి కదలాలని లేదు. మళ్ళీ ముసలాయనతో మాట్లాడి వద్దామన్నాను. లోహిని వెంటబెట్టుకొని, జొన్న చేలోకి నడిచాను ఆలుగడ్డలు ఏరడం ఐపోయింది. 
మీకు భయం కాదంటే ఇక్కడే పడుకోండి. లేదా, పక్కన జామతోటలో  కాపలా కుర్రాడు రేకుల షెడ్డులో ఉంటాడు అక్కడైనా ఉండొచ్చు’ అన్నాడు. 
అతను ఎద్దులకి చొప్ప మోపు కట్టిందాకా ఉండి ఆయన వెనకే కొట్టం దగ్గరికి వచ్చాము. 
ఎన్నో ఏండ్ల మామిడి చెట్టు అది. కొమ్మలు నేలకు ఆనుతున్నాయి. పావు ఎకరం జాగా విస్తరించి గొడుగులాగా ఉంది. చెట్టు కింద ఓపక్క ఆలుగడ్డలు నింపిన సంచులు, ఓపక్క ఎడ్లబండీ, ఎద్దులూ ఉన్నాయి. డ్రిప్ పైపు చుట్టలు ఇంకో పక్కన ఉన్నాయి. కాపలా వాళ్ళ గుడ్డలు, ఓపక్క పరిచిన బొంత అందులో రాలిన ఆకులు ఉన్నాయి. మధ్యాహ్నం ఎవరో పరుచుకుని అది మడతపెట్టకుండానే పనిలోకి పనిలోకి పోయినట్టున్నారు.  లోహి ఎడ్లబండిమీద వెనక్కివాలి పడుకోబోతే, అది కదిలిపొతుందన్నాడు ముసలాయన. కొడుకుదో మనవడిదో నెమలి బునుగు రంగు టీషర్ట్ తొడుక్కున్నాడు. అతని పేరు లక్ష్మయ్య.  బండి చక్రాలకు రెండు పక్కలా రాళ్ళు పెట్టి ఇంక పడుకోవచ్చన్నాడు. 
Tags: Adavi Nundi Adaviki, అడవి నుండి అడవికి, జయతి లోహితాక్షన్, Jayati Lohitakshan


