Krishnamurti Tatvam | కృష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం
- Author:
- Pages: 205
- Year: 1998|2016
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹180.00
జిడ్డు కృష్ణమూర్తి చెప్పినది ఏమిటి అని తెలుసుకోగోరే పాఠకులకోసం యీ సంకలన గ్రంథాన్ని ప్రచురిస్తున్నాము. ఇంతకు మునుపు కృష్ణమూర్తి రచనలు చదవనివారికి ముఖ్యంగా, యిది ఒక పరిచయ సంపుటంగా వుపయోగపడుతుంది.
నిత్యజీవితంలో ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలను పూర్తిగా మౌలికమైన, ఒక నవ్య దృష్టితో కృష్ణమూర్తి పరికించి విశదీకరిస్తారు. ఆ అంశమే యీ సంకలనంలోని విషయాలను ప్రత్యేకముగా ఎన్నుకొనడానికి గల కారణం.
విభిన్నమైన శాఖలకు చెందిన రచనలు యిందులో చోటుచేసుకున్నాయి. సభా ప్రసంగాలు, సందేహాలకు సమాధానాలు, వ్యాసరచనలు,ఇంటర్యూలు, దినచర్య వృత్తాంతాలు, యితరులకు చెప్పివ్రాయించినవి. లేఖలు, సంవాదాలు చర్చలు-వీటిలో జీవితానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన అంశాలను నిర్దుష్టతతో దృశ్యీకరించారు. ఆయన బోధనలు శిఖరాగ్ర స్థాయిని చేరుకున్న కాలం 1948 నుంచి 1983 వరకు. ఈ సంకలనములలోని విషయం ఆ కాలంనుండే సేకరించాము.
సత్యం మానవుడి మనస్సు నిర్మించుకున్న పరిమితులకు ఆవలగా, 'తెలుసుకున్నవారికి, సూత్రీకరించుకున్నవాటికి లేదా కల్పన చేసుకున్న వాటికి' ఆవలగా వుంటుందని, సత్యం కోసం అన్వేషిస్తున్నప్పుడు 'మొదటి అడుగే చివరదీ ' అని అంటారు కృష్ణమూర్తి. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆరంభించడంలోని వైశిష్ట్యాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఆ విధంగాచూస్తే ప్రతివారూ ఈ జీవనపయనంలో ఆరంభకులే. ఈ దృష్టితో చూసినప్పుడు యీ సంకలనం అందరి కోసమూ అని చెప్పవచ్చు.
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మే 12 వ తేదీన మదనపల్లిలో జన్మించారు. 14 వ ఏట దివ్యజ్ఞాన సమాజం వారు చేరదీయగా, అనీబెసెంట్ సంరక్షణలో పెరిగారు. భావికాలంలో జగద్గురువుగా భాసిల్లడం కోసం కృష్ణమూర్తికి శిక్షణ నిచ్చారు. అయితే 1929 లో హాలెండులో జరిగిన సమావేశంలో జగద్గురువు అనే యీ అత్యుత్తమైనపదవిని, తమ చుట్టూ ఏర్పడిన సంస్ధలనూ, ఆశేషమైన ఐశ్వరాన్నీ అవలీలగా పరిత్యజించివేసి ఒంటరిగా నిలబడ్డారు. ఏ సంస్ధల అధ్వర్యమూ లేకుండానే ప్రపంచమంతా పర్యటించి, మానవుడిని దుఃఖాల నుండి, సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే ప్రధానాంశంగా ప్రసంగించాడు. సత్యం అనేది బాటలులేని సీమ అని, అది చేరుకోవడానికి మతాలు గాని, సంస్థలుగాని, గురువులు గాని అవసరం లేదని నొక్కి చెప్పారు.
మత ధర్మమూ, తాత్వికతా, మనోతత్వ విచారణా కలిసి, అపూర్వమైన తీరులో సమ్మేళవించుకున్న కృష్ణమూర్తి బోధనలు సమగ్రమైన సంపూర్ణ జీవిత దర్శనాన్ని నిర్ధుష్టశైలిలో మనకు అందిస్తాయి.
1986 లో ఫిబ్రవరి 17న అమెరికాలోని ఒహాయిలో తుదిశ్వాస వదిలే వరకు, 60 సంవత్సరాల పాటు యూరప్, అమెరికా, లాటిన్ అమెరికా, శ్రీలంక, భారత దేశాలలో నిర్విరామంగా పర్యటించి ప్రసంగించారు. అసంఖ్యాకమైన ప్రజలను ప్రభావితం చేశారు.
ద్వేషాలూ, అసూయలూ, సంఘర్షణలూ, జాతి మత విభజనలూ లేని ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాలంటే విద్యా విధానంలోనే మార్పు రావాలనే దృక్పథంతో ఇండియా, అమెరికా, కెనడాలలో విద్యాసంస్థలను స్థాపించారు.
కృష్ణమూర్తి రచనల తెలుగు అనువాదాలు పాఠకులలో జీవితం ఎడల విచారణ శీలత్వాన్నీ, పరిశీలనా శక్తిని పెంపొందిస్తాయని ఆశిస్తున్నాము.
సమన్వయ కర్త
దక్షిణ భాషల అనువాద విభాగం
కృష్ణమూర్తి ఫోండేషన్, ఇండియా.
Tags: Krishna Murthy Tatvam, కృష్ణమూర్తి తత్వం, జిడ్డు కృష్ణమూర్తి, Jiddu Krishnamurthy