Viswambhara | విశ్వంభర
- Author:
- Pages: 83
- Year: 1980
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹90.00
విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి రచించిన పద్య కావ్యము. ఈ గ్రంథానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడింది. సినారె దీనిని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. దీనిని మొదటిసారిగా 1980లో ముద్రించారు.
ఈ విశ్వంభర కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ.స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీని మీద ఎం.ఫిల్., పి.హెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. దీనిని హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర అనువదించారు.
ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి.
మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.
అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!
కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!
ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు.
మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.
ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రం 'విశ్వంభర' కావ్యరచనకు పునాది.
Tags: విశ్వంభర, Viswambhara, సి.నారాయణరెడ్డి, C. Narayana Reddy