Telugu Sahityamlo Atma Kathalu | తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు

Telugu Sahityamlo Atma Kathalu | తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు

  • ₹150.00

ఆప్కారి సూర్యప్రకాశ్‌గారు ఒక సాహితీ సుక్షేత్రం. నడుస్తున్న గ్రంథాలయం. వీరి పరిచయంలో తెలుసుకున్న సంగతుల కంటే తెలుసుకోవలసిన సంగతులు అనేకం ఉన్నాయి. ఒక విషయాన్ని ఎలా తరచిచూడాలో వీరి రచనలు చెప్పకనే చెప్తాయి. ఇంతవరకు కేవలం వీరి కవితా ప్రవాహాన్ని మాత్రమే చవిచూసిన మనం ఈ పుస్తకం ద్వారా వీరి బహుముఖ ప్రజ్ఞను చవిచూడబోతున్నాం.

మూణ్ణెళ్ల క్రితం సూర్యప్రకాశ్‌గారింట్లో మాటల సందర్భంలో, గతంలో వారు తెలుగులో వచ్చిన ఆత్మకథలపై రాసిన రేడియో ప్రసంగాల గురించిన ప్రస్తావన వచ్చింది. అవి ఐదేళ్ల క్రితం నిజామాబాద్ ఆకాశవాణిలో ప్రసారమై శ్రోతల విశేషాదరణను చూరగొన్నాయి. వాటిని వ్యాసాలుగా పుస్తకరూపంలో ప్రచురిస్తే బాగుంటుందని మేము అనటం, దానికి వారు సమ్మతించి సంపాదకత్వ బాధ్యతను మాపై మోపటం, వారు అప్పట్లో వ్రాసుకుని, భద్రంగా దాచుకున్న వ్రాతప్రతులను మాకు అప్పజెప్పటం, మేము ఎంతో ఉత్సాహంగా వాటిని 'మహాప్రసాదం' అని భావించి, ఆ ప్రసంగాలను ప్రసార రూపం నుండి పఠితరూపంలోకి మార్చి, ఇదిగో.. ఈ పుస్తకంగా మలచటం జరిగింది.

తెలుగుసాహిత్యంలో గత మూడు శతాబ్దాలలో ఎన్నో స్వీయచరిత్రలు ప్రచురింపబడ్డాయి. ఎందరెందరో మహామహులు తమ జీవనప్రస్థానాన్ని, జీవిత సారాన్ని మథించి గ్రంథస్తం చేసి, వాటిని తమ తర్వాతి తరాలకు విలువైన పాఠాలుగా అందించారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విశిష్టమైన జీవనశైలి, జీవనయానం. సాహిత్యపరంగా ప్రతి ఒక్కరిదీ ఒక విలక్షణమైన భాష, శైలి, రచనాపద్ధతి. వాటిలోనుండి అప్పటి వీరేశలింగం గారి ‘స్వీయచరిత్రము’ మొదలు, నిన్నమొన్నటి ముళ్లపూడిగారి ‘కోతి కొమ్మచ్చి’ వరకు ఎంపిక చేసిన పదకొండు స్వీయచరిత్రల విలువైన సారాంశాలు, ఈ పుస్తకంలో పాఠకుల మెదడుకు సాహితీ రసాస్వాదనను కల్గిస్తాయి.

జీవితంలోని ఆటుపోట్లను, సంఘర్షణను తట్టుకొని, ఒక నిబద్ధతకు, మంచి విలువలకు, నియామాలకు కట్టుబడిన ఆ మహానుభావుల జీవితాలను మనం ఒక ప్రేరణగాను, స్ఫూర్తిగాను, ఆదర్శంగాను తీసుకోవచ్చును. తెలుగుభాష క్రమక్రమంగా ఆదరణ కోల్పోతున్న ఈ తరుణంలో వారి ‘రచనాప్రక్రియ’, ‘భాష’, ‘శైలి’ల నుండి రచయితలు, సాహితీప్రియులు ఎంతో నేర్చుకోవచ్చును. సహృదయులైన పాఠకులు, ముఖ్యంగా నేటి యువతరం, విద్యార్థులు ఈ పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం..

- సంపాదకులు


అత్మకథలన్నీ ఈ వేగ యుగంలో చదివే సమయం లేదు కనుక ఈ పుస్తకం చదివి ఆత్మకథల సారాంశాన్ని 'కొండ అద్దమందు కొంచెమై ఉండదా' అన్నట్టు, అద్దంలో ఆకాశం చూడవచ్చు. ప్రభువెక్కిన పల్లకి గురించి కాక, సామాన్యుని జీవితం తెలుసుకోవడానికి, చార్మినార్‌ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీల జీవితాలలోని కడగండ్లను తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. - ఆప్కారి సూర్యప్రకాశ్‌

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Telugu Sahityamlo Atma Kathalu, తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు, ఆప్కారి సూర్యప్రకాశ్, Apkari Suryaprakash